పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియానుండి బంగారు పతకం పొందిన గిరీశ్ కాసరవళ్ళి భారతీయ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసారు. డిప్లోమా కోసం తను చేసిన ʼఅవశేషʼ అనే కన్నడ చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు ʼబెస్ట్ స్టూడెంట్ ఫిల్మ్ʼ, ʼబెస్ట్ శార్ట్ ఫిక్షన్ʼ గా వెలువడింది.
పదిహేను ఫీచర్ సినిమాలు, పలు సాక్ష్య చిత్రాలు, రెండు టెలి ఫిలింలు, ʼగృహభంగʼ అనే కన్నడ సీరియల్ కోసం ఆయన దర్శకత్వం వహించారు. తన సినిమాల కోసం 27 అంతర్జాతీయ అవార్డులు, 25 జాతీయ అవార్డులు, 46 రాష్ట్ర అవార్డులను ఆయన అందుకున్నారు. వీటిలో 15 రాష్ట్రపతి అవార్డులు, 13 స్టేట్ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి ద్వారా నాలుగు సార్లు ʼస్వర్ణ కమలంʼ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ దర్శకుడు కాసరవళ్ళి. అంతే కాకుండా ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డు, వి.శాంతారామ్ అవార్డు, క్రిస్టల్ గ్లోబ్ అవార్డు, ఇలా 23 కి పైగా అవార్డులను ఆయన అందుకున్నారు. 36 దేశాలకంటే పైగా దేశాల్లో తన సినిమాలు ప్రదర్శించబడ్డాయి. అలాగే తన సినిమాల గురించి 11 ఇంగ్లిష్ పుస్తకాలు, 4 కన్నడ పుస్తకాలు ప్రచురితం అయ్యాయి.
కాసరవళ్ళి సినిమాలకు సంబంధించి మూడు పి.హెచ్.డి థీసిస్‌లు, మూడు పుస్తకాలు వెలువడ్డాయి. నాలుగు సంస్థలనుండి ‘Lifetime Achievement’ అవార్డులు, రెండు యూనివర్సిటీలనుండి గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు. సినీరంగంలోని కాసరవళ్ళి సేవకుగాను భారత రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది.