ఉజిరెలో బి.సి.ఎ డిగ్రీ తర్వాత కన్నడ ఎం.ఎ చదివిన అనుపమా ప్రసాద్ ఇప్పుడు కన్నడ సాహిత్యంలో మంచి కథకురాలిగా పేరు పొందిన రచయిత్రి. ʼచేతనʼ, ʼదూరతీరʼ, ʼజోగతి జోళిగెʼ, ʼచోద్యʼ అనే కథా సంకలనాలు, ʼపక్కి హళ్ళద హాదిగుంటʼ పేరుగల నవలను ఆమె ప్రచురించారు. కన్నడ రచయిత ఎం.వ్యాస గురించిన అతని తనయుడు తేజస్వి సహాయంతో ʼఅర్థ కథానకʼ అనే రచన, ʼకణ్ణీరుʼ, ʼమనసు మాయెయ హిందెʼ పేరుగల రేడియో నాటకాలను ఆమె రచించారు. తన ʼకరవీరద గిడʼ రచనకుగాను 2009 లో ʼముంబెళకు సాహిత్య అవార్డుʼ, 2011 లో ʼబేంద్రె పుస్తక బహుమతిʼ, తన ʼదూరతీరʼ కతా సంకలనం కోసం బెంగుళూరు రచయితల సంఘం ʼత్రివేణి కథాఅవార్డుʼ, కన్నడ సాహిత్య పరిషత్తు నుండి ʼవసుదేవభూపాలం అవార్డుʼ, ʼబెసగరహాళ్ళి రామణ్ణʼ కథా పురస్కారాలను ఆమె పొందారు. ʼజోగతి జోళిగెʼ రచన కోసం ʼమాస్తి పురస్కారంʼ, ʼకన్నడ సాహిత్య అకాడెమిʼ పురస్కారాలు, ʼపక్కి హళ్ళద హాదిగుంటʼ నవల కోసం కర్నాటక సాహిత్య అకాడెమి అందించే ʼచతురంగ ఎండోవ్‌మెంట్ అవార్డుʼ, 2023 లో తన ʼచోద్యʼ రచన కోసం సంగమ్ సాహిత్య అవార్డును ఆమె అందుకున్నారు.